Powered by Blogger.
RSS

.

.

25. జ్యోతి వలబోజు

అష్టవిధ నాయికల జడపద్యాలు:
భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో అష్టవిధ నాయికలుగా ఎనిమిది రకాల నాయికలను తెలిపారు. ఈ ఎనిమిది రకాల నాయికలు ప్రేమ, వలపు మొదలైన ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తారు. వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు. వాటిపై పద్యాలు రాస్తే బాగుంటుందని భావిస్తూ.. జడలకు అన్వయిస్తూ...

1. అభిసారిక
కం. జడి వానకు వడగళ్ళకు
జడియక బ్రేమికుని గల్వ జర జర సాగన్,
జడలున్ గాలిలొ యాడగ
జడలే ఫణులుగ గనపడె జనులకు యాహా!

2.ఖండిత
కం. జడలున్న తనను గాదని
గడపెను ప్రియుడామె యింట గత రాత్రంతా!
మెడబట్టుకు నెట్ట వలె, మొ
గుడిని మరగిన జడలేని కులుకుల గత్తెన్!

3. విప్రలబ్ద
కం. కన్నుల్ గాయలు గాచెను
తన్నున్ మరచెన? మగనికి తగిలిర గాంతల్?
వెన్నున్ వంగెను జడలచె
తన్నులె నీకిక మిగిలెను తప్పవు మామా!

4.కలహాంతరిత
కం. పోపో! రాకుము నాకడ
పాపల మరిగెను పతియని పరిపరి యేడ్చెన్!
ఆ పతి జడలను నిమరగ
వాపోయెన్ దా తదుపరి వలపుల తఫనన్!

5. వాసకసజ్జిక:
కం. పడకన జల్లెను పూలను
జడకున్ యల్లెను విరిసిన జాజుల తీవన్!
గడియకు వాకిలి జూచుచు
యెడదన్ మిక్కిలి వగచుచు యేడీ రాడే!

6. ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక:
కం. దూరపు దేశము లేగగ
కారాగారమె దలచుచు కడు దు:ఖమునన్
బారెడు జడలకు పూలను
గోరక జెలులతొ గడపెను ఘోరము గాదే!

7. విరహోత్కంఠిత:
కం. విరహపు వేదన తాపము
పరులకు జెప్పరు పడతులు పడియెడు బాధన్!
విరులను విప్పుచు జడలను
విరబోసికొనుచు విసుగున విలపించునహో!

8. స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక :
కం. పారాణి కాళ్ళ కద్దును
ఔరా! పతికేమిసిగ్గు యసలే లేదే!
లేరీ పురమున జడలకు
బారెడు పూలను దురిమెడు భర్తలు నిస్సీ!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

24. నల్లాన్ చక్రవర్తుల కిరణ్

రమణీయంగా బాపూ
రమణల పిలిచిందట జడ: "రండ్రండ్రండోయ్,
కమనీయంగా నా కథ
అమలిన శృంగారరీతి నల్లండయ్యా!

ఇదిగో, బాపూ, రమణా!
పదిలం మీ గుఱుతులన్ని పదచిత్రాలై
ఎద నింపే 'ఖద'లై అవి
గుది గుచ్చిన జడల లాగ గుండెలనూపున్!"

బాపు ఉవాచ:
రెంజెళ్ళ సీతకైనా
రంజించే రాధకైన రసవత్తరమై
కొంజం చాలా బోల్డుగ
వింజామరలయ్యి వీచు వేణులె అందం!

రమణ ఉవాచ:
అమ్మాయిని చూసినపుడు
అమ్మో, భయమేదొ గలుగు నబ్బాయిలలో!
గమ్మున భయపడకుండా
రమ్మన్నట్టు కులుకు జడ రమణి వెనకనే!

బుడుగు ఉవాచ"కందాన్ని" అద్దితే...
ముందుకు నొక జడ, వెనుకను
ఉందింకో జడ, తికమకగుందే, హయ్యో!
ముందుకొ, వెనకకొ నడకెటు?
గందరగోళం, తెలియని గడబిడ జడతో!

 

ఈ అవకాశాన్ని కల్పించిన విబుధులైన పెద్దలకు నమస్సులతో...
- "నచకి"

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

23. బి.ఎస్.ఎస్.ప్రసాద్

పిన్నకు రెండు జడలునూ 
మిన్నగ నోపును పడచుకు మిండుగ నొక్కటి 
వన్నెగ వాల్జడ, పూజడ
కన్నెకు సొగసగు , నందము  కానగ నెంతో
 
ఇంతి కిక జడ కనబడునె ?
కాంతలు కేసము లిడకను   క్రాపులు జెయ్యగ 
సుంతయు బెదరక అందరు
ఇంతులు నుంచగ పిలకలు నిప్పటి దినముల్

కుంకుడు పుల్లను రుద్దగ 
బంక వదల చిక్కుతీసి బడతులు కట్టన్ 
బింకముగ పట్ట సిరులా 
వంకన జడతో కళకళ  వనితకు  వచ్చున్ 

మెడవరకు కేసములునే 
తుదకున్ తరిగిన   నొక సతి తురతుర వెడలీ 
జడ శతకమ్మును  జూడగ
వేడె పతినొక సవరమును వెంటనె తేగా! 

కురులను జార విడి నటన
మురిపము గా జూపు నెమలి ముమ్మాట మగే!
శిరమున కురులే జూలుగ
పెరుగును, సింహం మగదయి పెరగగ. వింతే!

బి.ఎస్.ఎస్ ప్రసాద్

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

22. ఓరుగంటి సుబ్రహ్మణ్య చక్రవర్తి

తొడపాశము చిన్నప్పుడు,
జడపాశము యవ్వనమున జవ్వని చేతన్.
నడి వయసున ధనపాశము,
కడకా యమపాశమింక కర్మలె మిగులున్

జడగంటలు పిరుదులపై
తడిగిటథకథోమటంచు తాళము వేయన్
నడుమూపెడు గడుసరి కనఁ
బడితే తడబడనిఁదొక్క వ్యాసాత్మజుడే!


సుళ్ళే పస గుఱ్ఱానికి,
పెళ్ళే పస యవ్వనమున, పిరుదులు తాకే
జళ్ళే పస ఆడాళ్ళకు,
గుళ్ళే పస తిరుమలేశు గుడి ప్రాంగణమున్

బట్ట తలయున్న పురుషుడు
పట్టుదలగ జడశతకము పారణ చేస్తే
పట్టును మించెడు మెత్తని
జుట్టుమొలుచు నెత్తిమీద జులపాలొచ్చున్

జడశతకము చదవని మను
జుడు మన్మధుడైనగాని జుట్టంతా ఊ
డెడులాగున శపియింతురు
జడసౌందర్యమునెరిగిన జాణలు, సుకవుల్


నా గురించి చెప్పడానికి ప్రత్యేకించి ఏమీ లేదు. 
పేరు: ఓరుగంటి సుబ్రహ్మణ్య చక్రవర్తి.
వృత్తి: సీనియర్ సాఫ్టువేర్ ఆర్కిటెక్ట్. డెల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలలో పని చేసి తృప్తి లేక ఒక చిన్న కంపెనీలో రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. 
ప్రవృత్తి:  సాఫ్టువేర్  రంగంలో వున్న నాలాంటి వారికి ప్రవృత్తులు ఉండవు. ఊపిరి సలపని పని. ఫేసుబుక్ పుణ్యమా అని పద్యాలమీద మక్కువ కలిగి వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. హైస్కూలు లో చదివే రోజుల్లో "చక్రవర్తి మాట సద్దిమూట" అన్న మకుటంతో కొన్ని పద్యాలు వ్రాసాను. అంతే. 
కోరిక: ఏనాటికైనా సింహాచల శ్రీలక్ష్మీనరసింహస్వామిపై ఒక శతకం వ్రాసి నాతలిదండ్రులకు అంకితం ఇవ్వాలని

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

21. పంతుల సీతాపతిరావు

                పొడవగు జడ యొకటేనా ?
                జడ యందలి పూలు కూడ  చక్కగా మెరెసెన్ !
                అడుగులు  వేసిన తోడనె
                పడతులతోపాటు  జడయు వంకర పోవున్ !             1

                జడ పొట్టిది మెడ పొట్టిది
                జడ వేయగ కురులు పొట్టి చచ్చే దెట్లా ?
                జడ నైతే సవరించెద
                మెడ సవరణ సాధ్య మెటు లొ ? మీరే  చెపుడీ ?           2

                జడ గంటలు ,మెడ గంటలు
                జడ చుట్టూ పూలదండ జటిలంబనుచున్ ,
                జడ సొగసుకు యంద  మవగ  ,
                జడ నల్లక  విరగ బోయు సంస్కృతి పెరిగెన్!             3

                తడ కొట్టీ  జడ కురులను
                ముడి వేయక ద్రౌపదపుడు పూనెను శఫధమ్ !
                జడ యందలి  సౌభాగ్యము
               కడ  వరకూ యుండ వలయు కాంతల కెపుడున్ !       4

               జడ కుచ్చులు సవ రింపగ
               ఎడపడగా  బ్యూటి కేర్లు  ఎదిగెను  కానీ
               సడలిన దేహము తోడుగ,
               జడ రంగుల మార్పులన్ని సహజము కాదా!

పంతుల  సీతా పతి రావు
విశాఖపట్నం

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS